ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సొంత ఇల్లు,కారు, సెల్ ఫోన్ , చెప్పుకోదగ్గ
బ్యాంక్ బ్యాలెన్స్ లేవంటే ఆశ్చర్యం కలగకమానదు. కుంభకోణాల కాలంలో ఆయన దేశంలోనే
నిరుపేద సీఎం అంటే నమ్మశక్యం కాదు. సంపదలో కుచేలుడైనా వ్యక్తిత్వంలో కుబేరుడైన
ఆయనే త్రిపుర సీఎం మాణిక్ సర్కార్.వామపక్ష భావజాలాన్ని నరనరాన వంటబట్టించుకున్న
ఆయన...దేశంలో ఉన్న ఏకైక మార్క్సిస్టు సీఎం. 1998 నుంచీ త్రిపురను అప్రతిహతంగా
ఏలుతున్న ఆ మార్క్సిస్టు యోధుడు...సంత్రుప్తే తన ఆరోగ్య విజయ రహస్యం అంటారు
2008 ఎన్నికల సమయంలో సమర్పించిన అఫడవిట్ ప్రకారం
మాణిక్ బ్యాంకు బ్యాలెన్సు సుమారు రూ.16.120. ఈ మధ్య ఎన్నికలకు ముందు సమర్పించిన
అఫిడవిట్ లో అది సుమారు రూ.10,800. అయిదేళ్లు అధికారంలో ఉన్న తర్వాత వ్యక్తిగత
ఆస్తి తగ్గిపోయిన సీఎం సర్కారేనేమో. మాణిక్ కి డబ్బుపై వ్యామోహం లేదని ఇంతకంటే
నిదర్శనం వేరే ఉండదేమో. మనిషి సంతోషంగా ఉండాలంటే కావాల్సింది డబ్బు కాదు
సంత్రుప్తీ నీతీ నిజాయితీలని మాణిక్ ప్రగాఢ నమ్మకం. అవి ఎప్పుడూ తనలో ఉంటాయంటారు.
బెంగాల్, కేరళల్లో వామపక్ష ప్రభుత్వాలు కూలిపోయిన
తరుణంతో త్రిపురలో మళ్లీ తమ
పార్టీ విజయం సాధించడం తన గొప్పతనం కాదని తనకు రాజకీయాలు నేర్పిన గురువులదీ,తనను
ఆదరించిన రాష్ట్ర ప్రజలదీ, తనకు తోడూనీడగా నిలిచిన తన భార్యదేనని వినయంగా
చెప్పుకుంటారు మాణిక్.
దిగువ
మధ్యతరగతి కుంటుంబంలో పుట్టిన తాను ముఖ్యమంత్రినయ్యానంటే అదంతా మన ప్రజాస్వామ్యం గొప్పతనమేనని
చెబుతుంటారు మాణిక్.. సర్కార్ 1949 వ సంవత్సరంలో దక్షిణ త్రిపురలోని ఉదయపూర్ లో
పుట్టారు.నాన్న అమూల్య సర్కార్ దర్జీ. అమ్మ అంజలి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి.బాల్యం
అంతా సంతోషంగా గడిచిపోయింది.ఆ తర్వాత కలకత్తా విశ్వవిద్యాలయంలో బీకామ్ చదివారు.
అప్పట్లో వామపక్ష భావజాలం తీవ్రంగా ఉండేది.దానికి సర్కార్ కూడా
ఆకర్షితులయ్యారు.1967లో సీపీఎంలో అడుగుపెట్టారు.ఎస్ఎఫ్ఐ జాతీయ కార్యదర్శి అయ్యారు.1972లో
సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడయ్యారు.అప్పటికి త్రిపురలో న్రుపేన్ చక్రవర్తి
పార్టీలో ప్రధానపాత్ర పోషిస్తున్నారు.రాష్ట్రంలో కమ్యునిస్టు ఉద్యమాన్ని గాడిలో
పెట్టింది ఆయనే.చక్రవర్తే మాణిక్ కు రాజకీయ గురువని చెప్పాలి.1978 నుంచి పదేళ్ల
పాటు న్రుపేన్ త్రిపుర సీఎంగా ఉన్నారు.త్రిపురలో మొట్టమొదటి కమ్యునిస్టు సీఎం
ఆయనే.చాలా నిజాయితీగా నిరాడంబరంగా ఉండే ఆయనే మాణిక్ కు ఆదర్శం.
1980లో ఉపఎన్నికల్లో గెలిచి తొలిసారి మాణిక్
శాసనసభలోకి అడుగుపెట్టారు.ఆ తర్వాత 1983లో రెండోసారి గెలిచారు.1989,91లలో వెస్ట్
త్రిపుర లోక్ సభ స్థానం నుంచి పోటీచేశారు.అయితే 1989లో కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్
కు పాల్పడటంతో తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకున్నారు.91లో కాంగ్రెస్ ప్రభుత్వం
మళ్లీ అవినీతి అక్రమాలకు పాల్
డింది. దీంతో ఎన్నికలను బహిష్కరించారు
మాణిక్.1993లోత్రిపుర సీపీఎం కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 1998లో అసెంబ్లీకి
పోటీచేసి ఎన్నికయ్యారు. అక్కణ్ణుంచి ఇప్పటివరకూ ఓడిపోలేదు.
త్రిపుర బహుళ జాతులున్న రాష్ట్రం. ఈశాన్య
రాష్ట్రాల్లో ఉండే ఉగ్రవాద, శరణార్థుల సమస్యలు ఇవన్నీ త్రిపురలోనూ ఒకప్పుడు
ఉండేవి. మాణిక్ అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రంలోని గిరిజన తెగలకూ, బెంగాలీ
శరణార్థులకూ నిత్యం పోరు జరుగుతుండేది.ఇదంతా వనరుల ఆధిపత్యం కోసమే.రైతుల ఆత్మహత్యలు
ఎక్కువగా ఉండేవి.రహదారులు సరిగ్గా ఉండేవి కావు.రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రం కూడా అంత
అందంగా లేదు.కానీ, మాణిక్ అధికారంలోకి వచ్చాక ఉగ్రవాదం తగ్గించగలిగారు. అందుకోసం
కేంద్ర బలగాలను రప్పించలేదు. కొత్త చట్టాలను చేయలేదు. వాళ్లను అణచివేసే విధానాలను
అమలు చేయలేదు. సమస్యను వీలైనంత శాంతియుతంగానే పరిష్కరించారు.గిరిజన యువతను
ప్రత్యేక పోలీసు ఉద్యోగాల్లో నియమించారు. సాయుధ శరణార్థులూ ఉగ్రవాదుల సమస్యను ఆ
పోలీసులకే విడిచిపెట్టారు. గిరిజనులూ నిరుపేదల్లో ప్రభుత్వం పట్ట ఉన్న వ్యతిరేక
ధోరణిని మార్చగలిగారు.ముఖ్యంగా గిరిజనుల్లో అక్షరాస్యత పెంచేందుకు ప్రయత్నాలు
ప్రారంభించారు. స్కూల్ డ్రాపవుట్లు బాగా తగ్గించగలిగారు. మొదటిసారి అధికారంలోకి
వచ్చినప్పుడు ప్రాథమిక విద్య మీద ద్రుష్టిపెట్టారు. రెండోసారి
ఉన్నవిద్యాభివ్రుద్ధికి క్రుషిచేశారు. ఐటిఐలూ.ట్రిపుల్ ఐటీ, మెడికల్,డెంటల్
కాలేజీలూ, ఎన్ఐటీ ఇంకా ఎన్నో
ప్రారంభించారు. తద్వారా ఎంతో మంది యువతకు విద్య, ఉపాధి అవకాశాలు లభించాయి.
అదే సమయంలో బంగ్లాదేశ్ తో వాణిజ్యసంబంధాలు
మెరుగుపరిచారు. నోబెల్ బహుమితి విజేత ముహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ లో ఏర్పాటుచేసిన
గ్రామీణ బ్యాంకు తరహా బ్యాంకులను మా రాష్ట్రంలోనూ త్రిపురలోనూ ఏర్పాటుచేశారు.
మరోపక్క పర్యాటక రంగ అభివ్రుద్ధికీ క్రుషిచేశారు.మూడోసారి అధికారంలోకి
వచ్చినప్పుడు భారీ తరహా ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. భారీ జలవిద్యుత్తు
ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. పవర్ ప్లాంట్ల నిర్మాణానికి ప్రైవేటు వ్యక్తులను
ప్రోత్సహించకుండా ప్రభుత్వమే ఆ పని చూస్తోంది. అందువల్ల ప్రస్తుతం త్రిపురు
విద్యుత్ కొరతను అధిగమించి అదనపు విద్యుత్తును ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగింది. దాన్ని
ఇతర ఈశాన్య రాష్ట్రాలకు అమ్ముతున్నారు. రైతులకు తక్కువ ధరకే విద్యుత్తు,వ్యవసాయ సామగ్రి
అందేలా చూశారు. ఫలితంగా రైతుల ఆత్మహత్యలు తగ్గాయి. ఇలా ప్రభుత్వం ప్రజల
అభివ్రుద్ధికి పాటుపడుతోందన్నది వాళ్లకు విస్పష్టంగా తెలిసేలా చేశారు. మారుమూల
ప్రాంతాల్లోని ప్రజల జీవన ప్రమాణాలు పెంచి, వాళ్లలో మార్పు తీసుకొచ్చారు. కేంద్ర
పతకాలు రాష్ట్ర ప్రజలకు సక్రమంగా అందేలా క్రుషిచేస్తున్నారు. అవి పూర్తిస్థాయిలో
అందుతున్న అతికొద్ది రాష్ట్రాల్లో త్రిపుర ఒకటి. గతంలో రాష్ట్రంలో ఎప్పుడూ ఏదో
ఒకదాడి జరిగేది. నెత్తురు ఏరులై పారేది. అలాంటి దాడులన్నీ 2004 తరువాత దాదాపుగా
ఆగిపోయాయి. రాష్ట్రంలో ప్రశాంతత నెలకొంది. తమకూ త్రిపుర ఎంత మాత్రమూ అనువు కాదని
తెలుసుకున్నట్టున్రు....ఉగ్రవాదులు కూడా పారిపోయారు.
మాణిక్ భార్య
పాంచాలీ భట్టాచార్య. తనను బాగా అర్థం చేసుకునే మొదటి వ్యక్తి
పాంచాలీయేనంటారు మాణిక్. మాణిక్ దంపతులకు పిల్లలు లేరు. మాణిక్ పదవి గొప్పదేగానీ
నిజానికి ఆయనకన్నా ఆయన శ్రీమతి సంపాదనే ఎక్కువ.పాంచాలీ కేంద్ర ప్రభుత్వ సాంఘిక
సంక్షేమ శాఖలో పనిచేసేవారు. మూడేళ్ల కిందటే పదవీ విరమణ చేశారు. ఆమె పీఎఫ్,అవీ ఇవీ
కలిపి ప్రస్తుతం ఆమె వద్ద రూ.25 లక్షలున్నాయి. ముఖ్యమంత్రిగా మాణిక్ కు వచ్చే జీతం
రూ.10.400. దాన్ని పార్టీకే ఇచ్చేస్తారు. తిరిగి పార్టీ ఇచ్చే రూ.5000ను జీతంగా
తీసుకుంటారు. మాణిక్ కు పెద్ద ఖర్చులేం ఉండవు. ముక్కుపొడి, సిగరెట్టూ ...ఇంతే.
తనకు పార్టీ నుంచి వచ్చే జీతమూ, ఆయన శ్రీమతి ఫింఛనూ ఇవి చాలు తామిద్దరమూ సంతోషంగా
ఉండటానికంటారు మాణిక్. ఆయనకు సొంతిల్లు కూడా లేదు. కారూ లేదు. అంతేకాదు సొంత సెల్
ఫోన్ కూడా లేదు. మాణిక్ కు కాస్త శుభ్రంగా,ఫ్యాషనబుల్
గా ఉండటం ఇష్టం.అందుకే ఎప్పుడూ తెల్లటి కుర్తా పైజమా వేసుకుంటారు.రూ.2,500 ఖరీదైన
షూలూ. రూ.1800 విలువచేసే కళ్లద్దాలూ వాడతారు.మాణిక్ వాడే ఖరీదైన వస్తువులు ఈ
రెండే.మాణిక్ సర్కార్ కి క్రికెట్ అంటే ఇష్టం. కాలేజీ రోజుల్లో క్రికెట్ బాగా
ఆడేవారు. విరాట్ కోహ్లీ,సచిన్ టెండూల్కర్,సౌరవ్ గంగూలీ,అజహరుద్దీన్ మాణిక్ అభిమాన
క్రికెట్ ఆటగాళ్లు.2005లో మాణిక్ అగర్తలా వీధుల్లో ఉదయం పూట వాకింగ్ కి
వెళ్లాలనుకున్నారు. అధికారులు ప్రోటోకాల్ అదీ ఇదీ అన్నారు. తానో తీసుకున్నారంటే
మార్చుకోవడం కష్టం.దాంతో అధికారులంతా పాంచాలిని ఆశ్రయించారు. అప్పుడు ఆమె తన సొంత
డబ్బులతో మాణిక్ కి ఒక ట్రెడ్ మిల్ కొనిచ్చింది. ఇంట్లోనే వాకింగ్ చేసుకోమని
చెప్పింది. మాణిక్ సర్కార్ అమ్మ 2009 వరకూ అగర్తలలోని చిన్న ఇంట్లో ఉండేది. ఆమె
చనిపోయాక ఆ ఇంటిని మాణిక్ తన చెల్లెలు రత్నకి ఇచ్చేశారు. పాంచాలీ, మాణిక్ వారి
దుస్తులను వారే ఉతుక్కుంటారు. పాంచాలీ వద్దన్నా మాణిక్ వినిపించుకోరు. ఉదయాన్నే
ఠంచనుగా పదింటికి ఆఫీసుకు బయల్దేరుతారు మాణిక్. తన అధికారిక వాహనాన్ని తన కుటుంబ
సభ్యులు ఆఖరికి పాంచాలి వాడటానికి కూడా ఒప్పుకోరు. నిజానికి పాంచాలి కూడా అందుకు
వ్యతిరేకం. అది ఆమె ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం. ఇద్దరూ ఒకే కార్యక్రమానికి
వెళ్లాల్సి ఉన్నా పాంచాలి ఆటోలోనో రిక్షాలోనో వచ్చేస్తుంది. అంతేకాదు. పాంచాలి
బజారుకు వెళ్లాలన్నా కూడా అలాగే వెళ్లి కూరలు పచారీ సరుకులూ తీసుకొస్తుంది.సీఎం
శ్రీమతి అలా వెళ్తే ఎలా అని చాలామంది అడుగుతుంటే సీంనైన తనకే శత్రువులు లేరు
అలాంటప్పుడు ఆమెకు ఇంకెవరుంటారని మాణిక్ ఎదురు ప్రశ్నిస్తారు.1998లో మాణిక్
పార్టీకి 38 సీట్లు వచ్చాయి. 2003లో ఆ సంఖ్య 46కి పెరిగింది. ఈ ఏడాది ఆ సంఖ్య49కి
పెరిగింది. 1978 తరువాత మాణిక్ పార్టీకి సీట్లపరంగా ఇదే పెద్ద విజయం. ఈ అంకెలే
ప్రజలు మాణిక్ పార్టీని ఎంతగా నమ్ముతున్నారో చెప్పడానికి.
త్రిపురలో పోలింగ్ శాతం దేశంలో ఇతర రాష్ట్రాల
కంటే ఎక్కువగానే ఉంటుంది.మొన్నటి ఎన్నికల్లో దేశంలోనే అత్యధికంగా 93 శాతం ఓటర్లు
తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత ఎన్నికల్లో ఇది 92 శాతం ఈ అంకెలే
చెబుతున్నాయి త్రిపుర రాష్ట్ర ప్రజలు ఎంత చైతన్యవంతులో.త్రిపురలో ఓటు బ్యాంకు అనే
పదమే వినిపించదు. ఎందుకంటే అభివ్రుద్ధి లేనప్పుడూ ప్రజలు రాజకీయ నాయకులను
నమ్మనప్పుడూ వర్గాలుగా విడిపోయినప్పుడే ఓటుబ్యాంకు పుడుతుంది. కానీ త్రిపుర రాష్ట్రం
ప్రగతి పథంలో ముందుకెళ్తోంది. పార్టీ ఆఫీసులో మాణిక్ సర్కార్ కార్యదర్శులందరితో
కలిసి బెంచీ మీద కూర్చుంటారు.అందరితో కలిసి మురీలు తింటారు.అధికారిక పర్యటనల్లో
కూడా తన తోటివాళ్లంతా ఏం తింటే అదే తనకూ పెట్టమంటారు తప్ప తనకోసం ప్రత్యేకంగా ఏమీ
చేయించుకోరు. మాణిక్ పార్టీలో ఆదాయానికి మించి ఆస్తులున్నవాళ్లు ఉన్నారు.
అవినీతినీ, పార్టీ వ్యతిరేక విధానాలనీ, పార్టీ వ్యతిరేక జీవన విధానాన్ని సహించేది
లేదని విస్పష్టంగా చెప్పారు మాణిక్. తాను అమలుచేయలేని వాగ్దానాలు మాణిక్ చేయరు.
చేసిన వాగ్దానాలను నెరవేర్చేందుకు మాత్రం తన శక్తి వంచనలేకుండా క్రుషిచేస్తారు. తన
పని తీరును తాను నమ్ముకుంటారు తప్ప ఆర్భాటమైన ప్రచారాన్ని కాదు. మరో ముఖ్యమైన
విషయం ఏంటంటే మాణిక్ కు అధికార వ్యామోమం
లేదు. మాణిక్ తాను సాధారణ కార్యకర్తనంటారు.
ఇంకా చెప్పాలంటే సాధారణ పౌరుణ్ణంటారు.
దేశంలోని అతిచిన్న రాష్ట్రాల్లో త్రిపుర మూడోది.
జనాభా సుమారు 36 లక్షలు.త్రిపురలో స్త్రీపురుష నిష్పత్తి 961/1000 జాతీయ సగటు
940/1000 కన్నా ఎక్కువ. అలాగే అక్షరాస్యత 87.75 శాతం. దేశంలో అత్యధిక అక్షరాస్యత
ఉన్న రాష్ట్రాల్లో త్రిపుర మూడోది.మానవాభివ్రుద్ధి సూచికలో దేశంలో త్రిపుర 18వ
స్థానంలో ఉంది. ఈశాన్య భారతంలో అత్యధికంగా 24 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నది అరుణాచల్
ప్రదేశ్ సీఎం గెగాంగ్ అపాంగ్. ఆ తరువాత అత్యధికంగా 15 ఏళ్లు సీఎంగా ఉన్నది మాణిక్ సర్కారే. మార్క్సిస్టు సీఎంలు
విషయానికొస్తే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసు తరువాత అత్యధికకాలం ఉన్నది సర్కార్. ప్రస్తుతం సర్కార్ సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా ఉన్నారు(COURTESY:EENADU SUNDAY SPECIAL)
No comments:
Post a Comment